అన్నదాతలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ "ఏరువాక పౌర్ణమి". ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరుపుకునే ఈ పండుగను రైతన్నలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి.
ఏరువాక పౌర్ణమి. రైతులపండుగ. తమ కష్టాలు తీరాలని, పంటలు బాగా పండాలని భూతల్లికి పూజలు చేసుకొనే పండుగ ఇది. తొలకరి జల్లులు కురిసిన తరుణంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా వ్యవసాయ పనిముట్లకు పూజలు నిర్వహిస్తారు. పశువులకు స్నానాలు చేయించి కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు. రంగురంగుల తాళ్లు, గజ్జెలు, గంటలు తదితర అలంకరణలతో ఎద్దులను ముస్తాబు చేస్తారు. వీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. పోటా పోటీగా ఎద్దులతో ఏరువాక తాడును తెంచి ఉత్సవాలు జరుపుకుంటారు.
ఈ సందర్భంగా రైతులు ఉదయం గ్రామ సమీపంలో ఉన్న చెరువులు, కుంటల్లో ఎడ్లకు స్నానాలు చేయించి ఎద్దులకు వివిధములైన వస్తువులు తినిపిస్తారు. కొందరు కోడిగుడ్లను తాగిస్తారు. ఏరువాక పౌర్ణమి నుంచి వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. దీంతో పని ఒత్తిడికి గురయ్యే ఎద్దులకు బలం కోసం కోడి గుడ్లు మంచివని వారి అభిప్రాయం. కొన్ని చోట్ల వాటికి పసుపు, ఉల్లిపాయ, వాము, కోడిగుడ్డు తినిపించి సారాయి తాగిస్తారు. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో ఎద్దులకు ఎలాంటి రోగాలూ రావని వారి నమ్మకం. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగించారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు.
గ్రామాలలో జాతర వాతావరణం నెలకొంటుంది. ఆడపడుచులు పుట్టింటికి రావడంతో రకరకాల పిండీవంటలు చేస్తారు. ముఖ్యంగా ఎడ్ల పందాల హోరు కనిపిస్తుంది. యెద్దులను అలంకరించి, వాడిని పందెం పరుగు వేయించి, వెనకాతల ఊరి కుర్రకారు పరుగులు తీస్తారు. గెలిచినవారికి బహుమానాలు. సాయంకాలం గ్రామంలోని రైతులంతా మంగళవాద్యాలతో ఊరేగింపుగా పొలాలకు వెళ్లి దుక్కి ప్రారంభిస్తారు. ఊరి వాకిట గోగునారతో చేసిన తోరణం కడతారు. దాన్ని చెర్నాకోలలతో కొట్టి ఎవరికి దొరికిన పీచును వారు తీసుకుపోతారు. ఇది పశువులకు మేలు చేస్తుందని నమ్మకం. ఐరోపా దేశాల్లోని మేపోవ్ ఇటువంటి పండుగే.ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దులను అలంకరించేందుకు వినియోగించే సామాగ్రి కొనుగోలు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ముందు రోజున కొనుగోళ్ళు జరుపుతారు. ఎద్దులను అలంకరించేందుకు వినియోగించే వివిధ రకాల తాళ్లు, రంగులు, గంటలు, గజ్జెలు తదితరాలను రైతులు కొనుగోలు చేస్తారు.
మంత్ర యజ్ఞపరా విప్రా సీయజ్ఞాశ్చ కర్షకా:
గిరి యజ్ఞస్థథా గోపా: ఇజ్యోస్మాభిర్గిరిర్వనే ||
అని శ్రీకృష్ణ పరమాత్మ గోపాలురకు గిరియజ్ఞము, కర్షకులకు ఏరువాక యజ్ఞముగా, బ్రాహ్మణులు మంత్రజపమే యజ్ఞముగు చేయుదురని తెలుపగా, విష్ణుపురాణము దీనిని ఏరువాక సీతాయజ్ఞమని పేర్కొంటోంది.
ఈ ఏరువాక పండుగ అతి ప్రాచీనమైంది. పూర్వము శ్రీ కృష్ణదేవరాయ సార్వభౌముడు రైతన్నల కృషిని అభినందించి తగిన రీతిలో రైతు సోదరులను ప్రోత్సహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ.. ఒక బంగారు రంగు నాగలిని కర్షకులకు అందించినట్లు గాథలున్నాయి.
ఒకప్పుడు ప్రతీ సంవత్సరం కనిపించే ఈ సంప్రదాయ పండుగ ఇప్పుడు మెల్లగా కనుమరుగవుతోంది. అక్కడా అక్కడా రైతులుకూడా మర్చిపోతున్నారు!
No comments:
Post a Comment